గిరిజనుల సంస్కృతి ఉట్టిపడేలా..


కడలి న్యూస్, విశాఖపట్నం:–
  స్వాతంత్ర్యం ముందు, తర్వాత గిరిజనుల జీవన విధానంలో ఉపయోగించే పనిముట్లు, ఆయుధాలను సేకరించి రుషికొండలోని గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ మిషన్ (టీసీఆర్ అండ్ టీఎమ్) కార్యాలయ భవన సముదాయంలో భద్రపరుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన రూ. 35 కోట్ల నిధులతో ఏఎస్సార్ జిల్లా చింతపల్లి మండలం జంగి ప్రాంతంలో సుమారు 22 ఎకరాల్లో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం నిర్మాణం చేపడుతున్నారు. గిరిజనుల జీవన విధానాలు, అల్లూరి సీతారామరాజు తదితర సమరయోధుల పోరాట గాథలను తెలియజేసేలా దీన్ని నెలకొల్పుతున్నారు. అక్కడ ప్రదర్శనగా ఉంచడం కోసం సేకరించిన పనిముట్లను తొలుత టీసీఆర్ అండ్ టీఎమ్ కార్యాలయంలో ఉంచుతున్నారు. ఈ మేరకు సీతంపేట, పార్వతీపురం, సావేరు. రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలోని సవర, జాతాపు, నూకదొర, కొటియా, కోందు. కోయ వంటి గిరిజన జాతుల వేట, గృహోపకరణ, వ్యవసాయం, సంగీతం తదితర సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే పరికరాలను కార్యాలయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రాణి, క్యూరేటర్ డాక్టర్ పి.శంకరరావు తదితర అధికారుల ఆధ్వర్యంలో 2024 నవంబరు నుంచి సేకరిస్తున్నారు. అలాగే ఆంధ్రవిశ్వవిద్యాలయం ఫైనార్ట్స్ ఉత్తీర్ణులైన ఇద్దరు విద్యార్థులు ప్రవీణ్, కె.ఈశ్వరరావులతో పలు నమూనాలు, చిత్రాలను రూపొందిస్తున్నారు.

కామెంట్‌లు