కడలి న్యూస్, విశాఖపట్నం:– పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
కార్తీకమాసంలో అయ్యప్పస్వామి భక్తులు లక్షల సంఖ్యలో మాలధారణ చేస్తోన్నారు. దశలవారీగా వారంతా కూడా శబరిమలకు తరలి వెళ్తుంటారు. మెజారిటీ స్వాములు రైళ్ల మీదే ఆధారపడతారు. వారి కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేరళలోని వివిధ స్టేషన్లకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు. ఈ క్రమంలో తాజాగా విశాఖపట్నం నుంచి కొల్లం స్టేషన్ కు పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు.
ఈ నెల 18 నుంచి జ్యోతి దర్శనం ముగిసేంత వరకు అంటే 2026 జనవరి 21వ తేదీ వరకు ఈ రైళ్లు అయ్యప్పస్వామి భక్తులు, సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. తొలి రైలు ఈ నెల 18వ తేదీన పట్టాలెక్కనుంది. చివరి రైలు జనవరి 21వ తేదీన నడుస్తుంది. తమిళనాడులోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగించబోతోన్న నేపథ్యంలో.. వాటిని కూడా దర్శించడానికి వీలు కలిగినట్టయింది. ఈ నెల 18 నుంచి జనవరి 20వ తేదీ వరకు ప్రతి మంగళవారం ఉదయం 8:20 నిమిషాలకు విశాఖపట్నం నుంచి బయలుదేరే నంబర్ 08539 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 1:45 నిమిషాలకు కొల్లం చేరుకుంటుంది. ఈ నెల 19 నుంచి జనవరి 21వ తేదీ వరకు ప్రతి బుధవారం సాయంత్రం 5 గంటలకు కొల్లం నుంచి బయలుదేరే నంబర్ 08540 ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 11 నిమిషాలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, త్రిశూర్, ఆలువ, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, తిరువళ్ల, చెంగన్నూర్, కాయంకుళం మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. నేటి నుంచే ఈ రైళ్లు బుకింగ్స్ ఓపెన్ ప్రారంభం అయ్యాయి.
