ఈనెల 21నుంచి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గ‌శిర మాసోత్స‌వాలు

 


న‌వంబ‌ర్ 21 నుంచి డిసెంబ‌ర్ 19వ తేదీ వ‌ర‌కు శ్రీ క‌న‌క‌మ‌హాల‌క్ష్మి అమ్మ‌వారి దేవ‌స్థానం ప‌రిధిలో జ‌ర‌గ‌నున్న‌ మార్గ‌శిర మాసోత్స‌వాల‌కు వచ్చే భ‌క్తుల ర‌ద్దీకి త‌గ్గ‌ట్లు ప‌క్కా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించిన‌ జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్

భ‌క్తులే పాలు, పసుపు, కుంకుమ‌ల‌తో అభిషేకం చేయటంపై వైదిక‌ కమిటీ పున‌రాలోచించాల‌ని విజ్ఞ‌ప్తి

వీఐపీ, వీవీఐపీల ద‌ర్శ‌నాలు నిర్ణీత వేళ‌ల్లోనే జ‌రిగేలా ఆల‌య, పోలీసు అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాలి

 కడలి న్యూస్, విశాఖ‌ప‌ట్ట‌ణం:– న‌వంబ‌ర్ 21 నుంచి డిసెంబ‌ర్ 19వ తేదీ వ‌ర‌కు శ్రీ క‌న‌క‌మ‌హాల‌క్ష్మి అమ్మ‌వారి దేవ‌స్థానం ప‌రిధిలో జ‌ర‌గ‌నున్న‌ మార్గ‌శిర మాసోత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో జ‌రిగిన స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో ప‌లు అంశాల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు. భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో చ‌ర్య‌లు చేప‌ట్టాలని, ఉత్స‌వాల‌ను విజయ‌వంతంగా నిర్వ‌హించాల‌ని పేర్కొన్నారు. పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేయాల‌ని, ట్రాఫిక్ నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, వాహ‌నాల‌కు పార్కింగ్ స‌దుపాయం క‌ల్పించాల‌ని సూచించారు. ప్ర‌తి గురువారం ఏవీఎన్ కళాశాల దిగువ నుంచి వాహ‌నాలు దారి మ‌ళ్లించుట‌, శుక్ర, శ‌నివారాల్లో టౌన్  కొత్త రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు వ‌ర‌కు ట్రాఫిక్ మ‌ళ్లించాల‌ని పోలీసు శాఖ అధికారుల‌కు సూచించారు. భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా స‌రిప‌డా క్యూలైన్లు, మంచినీటి స‌దుపాయం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం లేకుండా చూసుకోవాల‌ని, పారిశుద్ధ్య చ‌ర్యలు చేప‌ట్టాల‌ని, ఎక్క‌డిక‌క్క‌డ డ‌స్ట్ బిన్లు ఏర్పాటు చేయాల‌న్నారు. పోలీసు శాఖ సూచ‌న‌ల మేర‌కు అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చాల‌ని ఆల‌య అధికారులను ఆదేశించారు. నిత్యన్న‌దానం, ప్ర‌సాదం కౌంట‌ర్, క్యూలైన్ల వ‌ద్ద స‌రిప‌డా సిబ్బందిని అందుబాటులో ఉంచాల‌ని, భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. ఎక్కడికక్కడ సూచిక బోర్డులు, వికలాంగులకు వీల్ చైర్లు, ప్ర‌త్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని విభాగాల అధికారులతో ఆలయ సమీపంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డుకు ఆనుకొని ఉన్న దుకాణాలను వెనక్కి జరపాలని, ట్రాఫిక్ అంతరాయం, భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సేవా సంఘాలు, ఎన్.ఎస్.ఎస్., ఎన్.సి.సి. వాలంటీర్లను వినియోగించుకొనే ప్ర‌క్రియ పార‌ద‌ర్శ‌కంగా ఉండాల‌న్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

భ‌క్తులే స్వ‌యంగా అభిషేకాలు చేయ‌టంపై వైదిక క‌మిటీ పున‌రాలోచించాలి

ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తులే స్వ‌యంగా పాలు, పసుపు, కుంకుమ, పుష్పాలు అమ్మ‌వారిపై వేసి అభిషేకాలు చేయ‌టంపై వైదిక క‌మిటీ ఒక‌సారి పున‌రాలోచ‌న చేయాల్సి ఉంద‌ని క‌లెక్ట‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. పూజా సామ‌గ్రిని భ‌క్తుల నుంచి పూజారులు లేదా వాలంటీర్లు తీసుకొని అమ్మ‌వారికి స‌మ‌ర్పించేలా ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు తీసుకుంటే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇలా చేస్తే భ‌క్తుల‌కు త్వ‌రిత‌గిన ద‌ర్శ‌నాలు క‌ల్పించ‌డానికి వీలు క‌లుగుతుంద‌ని, ర‌ద్దీని నియంత్రించ‌గ‌ల‌మ‌ని పేర్కొన్నారు. దీనిపై పోలీసు అధికారులు కూడా ఏకాభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. ఈవో శోభారాణి స్పందిస్తూ... వైదిక కమిటీ దృష్టిలో పెట్టి తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు. న‌వంబ‌ర్ 19వ తేదీ నాటికే అన్ని ర‌కాల ప‌నులు పూర్తి చేయాల‌ని, ముఖ్యంగా బారికేడ్లు పెట్టేయాల‌ని ఆల‌య అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా ఆదేశించారు. వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్నందున రైన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాల‌ని, క్యూలైన్ల‌లో చిన్న పిల్ల‌ల‌కు పాలు, బిస్కెట్లు అందుబాటులో ఉంచాల‌ని చెప్పారు. ప్ర‌సాదం, తాగునీటి నాణ్య‌త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. వీఐపీ, వీవీఐపీల ద‌ర్శ‌నాలు నిర్ణీత వేళ‌ల్లోనే జ‌రిగేలా ఆల‌య, పోలీసు అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాలని నొక్కి చెప్పారు. ఇందులో ఎలాంటి రాజీప‌డాల్సిన ప‌ని లేద‌ని తేల్చి చెప్పారు. దీనికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. ఏర్పాట్లపై సంబంధిత అధికారులంతా ఒక‌సారి జాయింట్ ఇన్సెపెక్ష‌న్ చేయాల‌ని సూచించారు. గురువారాల్లో ఆ ప్రాంతంలో న‌డిచే ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీస్ రూట్లను మార్చాల‌ని, పోలీసు అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆర్టీసీ ఆర్ఎంను ఆదేశించారు. అనంత‌రం ఉత్స‌వాల‌కు సంబంధించిన పోస్ట‌ర్ను క‌లెక్ట‌ర్, ఇత‌ర అధికారుల చేతుల మీదుగా ఆవిష్క‌రించారు.

ఆ స‌మ‌యంలోనే దర్శనాల‌కు రావాలి: ఆల‌య ఈఓ

మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా నాలుగు గురువారాలు న‌వంబ‌ర్ 27, డిసెంబర్ 04, 11, 18వ తేదీల్లో వస్తున్నట్లు ఈవో కె. శోభారాణి వెల్లడించారు. ఈ దినాల్లో బుధవారం తెల్లవారు ఝాము 2.30 గంట‌ల‌ నుంచే దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో ఉదయం 6.00 నుంచి 11.30, మధ్యాహ్నం 12.00 నుంచి సాయంత్రం 5.30 వరకు, రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు సర్వదర్శనం ఉంటుందని చెప్పారు.  భక్తులు ఈ వేళల్లో అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. త్రికాల సమయాల్లో అభిషేకాలు జరుగుతాయని వెల్లడించారు. వీఐపీల‌కు ఉద‌యం 6.00 నుంచి 8.00 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 4.00 గంట‌ల వ‌ర‌కు స్లాట్స్ కేటాయించామ‌ని స్ప‌ష్టం చేశారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం ప్ర‌తి రోజూ ఉద‌యం 11.00 గంట‌ల నుంచి జ‌గ‌న్నాధ స్వామి ఆల‌యం వ‌ద్ద అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఉంటుంద‌ని, అలాగే డిసెంబ‌ర్ 18వ తేదీన సున్న‌పువీధి దిగువ నుంచి కొత్త‌రోడ్డు వ‌ర‌కు గ‌ల రోడ్డులో మ‌హాన్న‌దానం ఏర్పాటు చేస్తున్నామ‌ని ఈవో తెలిపారు. విశిష్ట ద‌ర్శ‌నం రూ.500, రూ.200, ప్ర‌త్యేక ద‌ర్శ‌నం రూ.100గా క‌మిటీ నిర్ణ‌యించిన‌ట్లు పేర్కొన్నారు. మార్గ‌శిర మాసోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌తి ఒక్క‌రూ సంపూర్ణ స‌హ‌కారం అందించాల‌ని ఈ సంద‌ర్బంగా ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. కార్య‌క్ర‌మంలో ఆలయ ఈవో కె. శోభారాణి, కార్యనిర్వహక అధికారి సి.హెచ్.వి. రమణ, ఏఈవో రాజేంద్ర‌, పోలీసు అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, క‌మిటీ స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

కామెంట్‌లు