అరకు కాఫీ బ్రాండింగ్ కి టాటా సంస్థతో ఎంఓయూ ఐటీడీఏలతో రబ్బర్, కాఫీ బోర్డులు ఒప్పందాలు









పర్యాటకంలో హోమ్ స్టేల అభివృద్ధికి ముందుకొచ్చిన ఓయో

ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గిరిజనుల అభివృద్ధికి కుదిరిన 21 ఒప్పందాలు

కడలి న్యూస్, పాడేరు:– గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆదివాసీలకు జీవనోపాధి అవకాశాలు, వ్యవసాయ అభివృద్ధి, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటం లాంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వం కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకుంది. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని వివిధ సంస్థలు ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. అరకు కాఫీ మార్కెటింగ్ సహా వివిధ అటవీ, గిరిజన ఉత్పత్తులకు దేశీయంగా, విదేశాల్లో మార్కెటింగ్ కల్పించేలా ఈ అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. రంపచోడవరం ఐటీడీఏ ప్రాంతంలో రబ్బరు సాగును ప్రోత్సహించేందుకు వివిధ మౌలికసదుపాయాల కల్పన, సాగు విస్తరణ కోసం కేంద్రీయ రబ్బర్ బోర్డు ఐటీడీఏ తో ఒప్పందం కుదుర్చుకుంది. గిరిజన ఉత్పత్తుల విక్రయాలు, అరకు కాఫీకి ప్రోత్సాహం కల్పించేందుకుగానూ జీసీసీతో ఒప్పందం కుదిరింది. స్థానికంగా డ్వాక్రా మహిళలు రూపొందించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అరకు కాఫీ కియోస్క్ ను మెప్మా ద్వారా ఏర్పాటు చేసేందుకు కూడా మరో ఒప్పందం కుదిరింది. ఇక గిరిజన సహకార కార్పోరేషన్ ఉత్పత్తులను అమెరికా లాంటి దేశాల్లో విక్రయించేందుకుగానూ హాతీ సర్వీసెస్ ఎల్ఎల్ సీ కంపెనీతోనూ జీసీసీ ఒప్పందం చేసుకుంది. యూఎస్ఏలోనూ జీసీసీ సంస్థ తన రీటైల్ ఆపరేషన్స్ చేపట్టేలా ఈ ఒప్పందం తోడ్పడనుంది. గిరిజన ఉత్పత్తులను ఏపీతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విక్రయించేందుకు గానూ ట్రైఫెడ్ -ఏపీ జీసీసీలు సంయుక్తంగా రీటైల్ షోరూమ్ లను ఏర్పాటు చేసేందుకు ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. గిరిజనుల ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఉద్దేశించి ఈ ఒప్పందం తోడ్పడనుంది. అలాగే షోరూముల వద్ద అరకు కాఫీ కియోస్క్ లను ఏర్పాటు చేయాలని కూడా ఒప్పందంలో అవగాహన కుదిరింది.  ప్రముఖ కార్పోరేట్ దిగ్గజం టాటా కన్స్యూమర్స్ సంస్థ కూడా ఆర్గానిక్ అరకు కాఫీని బ్రాండ్ చేసేందుకు, మార్కెట్ చేసేందుకు జీసీసీతో ఒప్పందం చేసుకుంది. చింతపల్లిలో రెడ్ చెర్రీ పండ్ల రైపెనింగ్,  ప్రాసెసింగ్ యూనిట్ సహా మౌలిక సదుపాయాల కల్పన కోసం సబ్ కో సంస్థ ఎంఓయూని కుదుర్చుకుంది. 

గిరిజన ప్రాంతాల్లో హోమ్ స్టేల అభివృద్ధికి ఎంఓయూలు

ప్రస్తుతం ఉన్న ప్రాంతంతో పాటు అదనంగా 1600 హెక్టార్లలో కాఫీ ప్లాంటేషన్ విస్తరించేందుకు ఐటీసీ సంస్థ ఐటీడీఏ పాడేరుతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే 4010 హెక్టార్లలో స్థానిక రైతుల సహకార సంస్థతో కలిసి ఐటీసీ కాఫీని సాగుచేస్తోంది. కాఫీ బోర్డు కూడా గిరిజన ప్రాంతాల్లో కాఫీ సాగు విస్తరణ, నాణ్యమైన కాఫీ పంట ఉత్పత్తి, సాగులో సుస్థిర విధానాల అమలు కోసం ఒప్పందం చేసుకుంది. గిరిజన మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ కల్పించే అంశంపై ఫ్రాంటియర్ మార్కెటింగ్, ఈజీ మార్ట్ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాన్ని చేసుకున్నాయి. పసుపు ఉత్పత్తి, వివిధ టర్మరిక్ ఉత్పత్తులకు మార్కెటింగ్ ను అనుసంధానించటం, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎక్విప్ సంస్థ ఐటీడీఏతో ఎంఓయూ కుదుర్చుకుంది. సీజన్ల వారీగా ఉత్పత్తి అయ్యే అటవీ ఉత్పత్తులను గిరిజన మహిళా సంఘాల ద్వారా విక్రయించేందుకు వీలుగా అవగాహన కల్పించేందుకు ఐఎస్బీ సంస్థ మరో కీలకమైన ఒప్పందం చేసుకుంది. ఇక పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో హోమ్ స్టేలను ఏర్పాటు చేసేందుకు ఓయో హోమ్స్, హోమీ హట్స్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. గిరిజన విద్యార్ధుల్లో నైతిక విలువల పెంపుకోసం మార్పు సొసైటీ కూడా ఎంఓయూ చేసుకుంది. అలాగే ప్రకృతి సేద్యం, మార్కెటింగ్ సదుపాయాలు, జీవనోపాధి తదితర అంశాల్లోనూ అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. గిరిజన పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగు పర్చేందుకు ఏపీ టూరిజం ఫోరం ముందుకు వచ్చింది.

కామెంట్‌లు