రేపే(జులై12) విశాఖ బీచ్ రోడ్డులో హర్ ఘర్ తిరంగా యాత్ర


కాళీమాత ఆల‌యం నుంచి అట్ట‌హాసంగా ప్రారంభంకానున్న బైక్ ర్యాలీ

ప్రజలు, యువ‌త‌ భాగస్వామం కావాల‌ని.. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిలుపు 

కడలి న్యూస్, విశాఖపట్నం:– భారత స్వాతంత్ర్యానికి 79 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు చేప‌ట్టిన‌ "హర్ ఘర్ తిరంగా" కార్యక్రమాల్లో భాగంగా మంగ‌ళవారం ఉద‌యం 6.30 గంట‌ల నుంచి (12వ తేదీ) స్థానిక బీచ్ రోడ్లో హ‌ర్ ఘ‌ర్ తిరంగా యాత్ర నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. దీనిలో భాగంగా జాతీయ పతాకం ప్రాముఖ్యతను, స్వాతంత్ర్య పోరాటంలో, దేశ ప్రజలను సమైక్యంగా ఒక్క తాటిపై నిలిపి ఉంచడంలో జాతీయ జెండా భూమికను తెలిపే కార్యక్రమాలను చేపట్టనున్నట్టు వెల్లడించారు. సోమ‌వారం పీజీఆర్ఎస్ అనంత‌రం అధికారుల‌ను ఈ మేర‌కు ఆదేశించారు. పక్కా ఏర్పాట్లు చేయాల‌ని, అన్ని విభాగాల అధికారులు స‌మ్వ‌యం వ‌హించి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. జాతీయ పతాకాన్ని ఎగరేయడం ద్వారా దేశభక్తిని వ్యక్తం చేయడం, జాతీయ పతాకంపై వ్యక్తిగత అనుబంధాన్ని మరింతగా పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు భారీ ఎత్తున తిరంగా యాత్ర సాగుతుంద‌ని, దీనిలో భాగంగా బైక్ ర్యాలీ ఉంటుంద‌ని చెప్పారు. థింసా, కోలాటం, భ‌ర‌త‌నాట్యం వంటి కళా రూపాల ప్రదర్శనతో తిరంగా యాత్ర జరుగుతుందన్నారు. యాత్ర‌లో ప్రజలు, యువ‌త‌ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

కామెంట్‌లు