కేదారనాథ్ యాత్ర ప్రారంభం ఆర్మీ బ్యాండ్ ప్రదర్శన!

 





కడలి న్యూస్ :–
హిందువులు అత్యంత పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రాలుగా భావించేవాటిలో ఒకటైన కేదార్నాథ్ క్షేత్రం ఇవాల్టి నుంచి భక్తులకు అందుబాటులో ఉండనుంది. అంగరంగ వైభవంగా ఆలయాన్ని అలంకరించి, పురోహితులు తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా ఆర్మీ బ్యాండ్ ఆలయం వెలుపల నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంటోంది. 

కేదార్ నాథ్ యాత్ర ప్రారంభం

శ్రీ కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు శుక్రవారం ఉదయం 07:00 గంటలకు భక్తుల కోసం తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ కార్యక్రమానికి హాజరై భక్తులను ఆలయంలోకి స్వాగతించారు. భారత ఆర్మీ బ్యాండ్ భక్తి గీతాలను ప్లే చేసింది. హెలికాప్టర్ నుండి భక్తులపై పూల వర్షం కురిపించారు.

కేదార్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. ఈ ఉదయం 7గంటల 10 నిమిషాల తర్వాత కేదార్‌నాథ్‌ ఆలయం తెరుచుకుంది. కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.. 13వందల కిలోల బంతిపూలతో అలంకరించారు. ఆలయమే కాదు.. ఆలయ ప్రాంగణాన్ని కూడా రంగురంగుల పూల తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు నిర్వాహకులు. ఇప్పటికే, కేదార్‌నాథ్‌ ఆలయానికి పెద్దఎత్తున చేరుకున్నారు భక్తులు. దేశ నలుమూలల నుంచి వస్తోన్న భక్తులు.. దర్శనం కోసం ఆలయం ముందు పోటెత్తారు. ఆలయ తలుపులు తెరవగానే.. దర్శనాలు ప్రారంభమయ్యాయి.  చార్‌ధామ్‌ యాత్రలో భాగంగానే కేదార్‌నాథ్‌ ఆలయ దర్శనం కూడా ఉంటుంది. కేదార్‌నాథ్‌ ఆలయ దర్శనం కోసం దేశవిదేశాల్లో హిందువులు పోటెత్తుతారు. పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో కేదార్‌నాథ్‌ ఆలయం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరించడంతోపాటు ఎక్కడికక్కడ నిఘా పెట్టారు.

సముద్ర మట్టానికి 3వేల 583 మీటర్ల ఎత్తులో ఉంటుంది కేదార్‌నాథ్‌ ఆలయం. మందాకిని నది ఒడ్డున నెలవైవున్న కేదార్‌నాథ్‌ ఆలయం.. ఆరు నెలలపాటు మంచులోనే ఉంటుంది. దాదాపు ఏడాది అంతా మూసి ఉండే కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు.. వేసవి కాలంలో మాత్రమే తెరుచుకుంటాయి.  ఆలయ తలుపులు తెరిచి ఉండే ఈ కొద్దిరోజుల్లోనే కేదార్‌నాథ్‌ క్షేత్రంలోని శివుడిని దర్శించుకుంటారు భక్తులు.

కామెంట్‌లు