ఇలా వరలక్ష్మీ వ్రతం చేస్తే... అష్టైశ్వర్యాలు, అమ్మవారి అనుగ్రహం!

వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత లక్ష్మీదేవి.. అష్టైశ్వర్యాలకు, సిరిసంపదలకు మూలమైన విష్ణుపత్నిని ప్రత్యేకంగా శ్రావణమాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం పూజించే సంప్రదాయం కొనసాగుతోంది.
ప్రధానాంశాలు:
శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ పూజ.
నైవేద్యంగా అవు పాలతో చేసిన పదార్థాలు.
పూజలో కనకధారస్తవం, లక్ష్మీ సహస్రనామాాలు.
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం. అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు. కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరమూ అవసరం ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారని హిందువుల నమ్మకం. ఇంతకీ ఈ వ్రతవిధానం ఏంటి? పూజను ఎలా చేయాలనేది పండితులు వివరించారు.
వరలక్ష్మీ వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి. ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి, ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం. కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి. ఆ ముగ్గుల మీద పసుపు, ముగ్గు బొట్లు పెట్టిన పీటని ఉంచాలి. దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి.... కలశాన్ని ప్రతిష్టించాలి.
కలశపు చెంబుకి పసుపు కుంకుమ అద్ది, దానిపై కొబ్బరికాయను ఉంచాలి. పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. కొబ్బరికాయతో పాటుగా కలశంపై మామిడి ఆకులను ఉంచడమూ శుభసూచకమే! అమ్మవారిని అష్టోత్తరశతనామావళితో పూజించిన తర్వాత తోరగ్రంధిపూజ చేస్తారు. ఇందు కోసం మూడు లేదా అయిదు తోరాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ, తోరపూజలోని ఒకో మంత్రం చదువుతూ ఒకో ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి.
వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ... అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి. ఇకపూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు. ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట. అందుకని పూజలో ఆవునేతితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది. అలాగే ఆవుపాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు. వీటితో పాటుగా మన శక్తి కొలదీ తీపిపదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు.
కొబ్బరికాయ అన్నా, అరటిపండన్నా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం. కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరువకూడదు. వరలక్ష్మీ పూజలో భాగంగా అష్టోత్తరశతనామావళి, మహాలక్ష్మి అష్టకమ్ తప్పకుండా ఉంటాయి. వీటితో పాటుగా కనకధారాస్తవం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మీ స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట. ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తయిదువుని అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు.
వరలక్ష్మీ పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి.. ముత్తయిదువను సాగనంపిన తర్వాత భోజనం చేయాలి... సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తయిదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి.. అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు.. అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది.
కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపుముద్దలు కానీ, పసుపుకొమ్ములని కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. వరలక్ష్మీ వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు. కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలన్నింటిని తీసుకుని వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంగళమూ జరగదని పండితులు చెబుతున్నారు.
మడపం ఏర్పాటు, కలశ స్థాపన విధానం ఇదే
వరలక్ష్మీ వ్రతాన్ని చేసే మహిళలు ముందుగా మండపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. మండపంలో బియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది అందులో కలశాన్ని ఉంచి మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుళ్లను అందులో వేయాలి. కలశంపై కొబ్బరికాయ నుంచి దానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి దానిని ఎరుపు రంగు జాకెట్ ముక్క తో అలంకరించాలి. ఇక అమ్మవారి ముఖాన్ని కలశం పైన అందంగా అమర్చుకోవాలి. పసుపుతోనైనా, బియ్యంపిండి, మైదా పిండితో గానీ అమ్మవారి ముఖాన్ని తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లోనూ అమ్మవారి విగ్రహాలు అందుబాటులో ఉంటున్నాయి. లేదంటే అమ్మవారి చిత్రపటాలను కూడా ఏర్పాటు చేసుకుని పూజించవచ్చు.

వరలక్ష్మీ అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు .. ఎక్కువగా చేసే నైవేద్యాలు ఇవే 
వరలక్ష్మీ అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు .. ఎక్కువగా చేసే నైవేద్యాలు ఇవే
వరలక్ష్మీ వ్రతం నాడు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడానికి మల్లెలు, సంపెంగలు, మొగలి పువ్వులు, కలువ పువ్వులు వంటి రకరకాల పువ్వులను ఉపయోగించవచ్చు . వరలక్ష్మీ వ్రతం నాడు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి తొమ్మిది రకాల పిండివంటలు చేయాలని పెద్దలు చెప్తారు. ముఖ్యంగా చాలా మంది అమ్మవారికి పూర్ణాలు, గారెలు, బూరెలు, పరమాన్నం, పులిహోర, బొబ్బట్లు, చలిమిడి, వడపప్పు, శనగలు నైవేద్యంగా నివేదిస్తారు. తొమ్మిది రకాల వంటలు చేయలేని వాళ్ళు తమకు చేతనైనన్ని చేసుకోవచ్చని కూడా పెద్దలు చెప్తారు .అయితే అత్యంత భక్తి భావనతో అమ్మవారిని పూజించడమే ప్రధానమని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి.
వరలక్ష్మీ అమ్మవారి పూజా విధానం 
చక్కగా మండపాన్ని సిద్ధం చేసుకున్న తరువాత, తొమ్మిది రకాల పిండివంటలను సిద్ధం చేసి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ప్రారంభించటానికి ముందు వరలక్ష్మీ దేవిని చక్కగా పువ్వులు ఆభరణాలతో అలంకరించి ఆ తల్లిని ఆవాహన చేయాలి. అమ్మవారు ఇంట్లోనే కూర్చున్నారా అన్నట్టు మహిళలు చక్కగా అమ్మవారిని అలంకరించి ఆవాహనం చేస్తారు .వరలక్ష్మి అమ్మవారిని కీర్తిస్తూ అష్టోత్తర శత నామాలతో అర్చన చేయాలి. అమ్మవారికి ధూపదీపాలు నైవేద్యాలను సమర్పించి, వరలక్ష్మీ వ్రత కథను చదివి ఆ తల్లి మహత్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. అమ్మవారి పూజలో అష్టోత్తర శతనామావళికి ఒక విశిష్టత ఉంది. వరలక్ష్మీదేవి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కథ ఉందని పురాణాలు చెబుతున్నాయి.
అమ్మవారి మహత్యాన్ని చెప్పే వరలక్ష్మీ వ్రత కథ
ఇక వరలక్ష్మి వ్రత కథ విషయానికి వస్తే పూర్వం మగధ దేశంలో కుండినమనే పట్టణంలో చారుమతి అనే మహాసాధ్వి అయినా ఓ బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సత్ప్రవర్తన కలిగి, వినయవిధేయతలతో భర్తను, అత్తమామలను సేవిస్తూ జీవనం సాగించేది. ఆమె వినయవిధేయతలకు మెచ్చి మహాలక్ష్మీదేవి ఆమెకు స్వప్నంలో సాక్షాత్కరించి ఆమెకు వరలక్ష్మీ వ్రతాన్ని ఉపదేశించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయని చెప్పింది. ఆ ప్రకారం చారుమతి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలు పొందుతుంది. అప్పటి నుండి ముత్తయిదువులు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించటం ఆనవాయితీగా పెట్టుకున్నారు.
ముత్తయిదువుల ఆశీర్వాదంతో ముగింపు .. వరలక్ష్మీ వ్రతం చేస్తే కలిగే ఫలితాలివే
ఇక శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో వారంతా సాయంత్రం ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలిచి కాళ్ళకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి వారికి పండు,తాంబూలాన్ని ఇచ్చి వారి దగ్గర నిండు నూరేళ్లు పసుపుకుంకుమలతో చల్లగా జీవించమని ఆశీర్వాదం పొందుతారు. ఈ విధంగా చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని మహిళలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అంతేకాదు శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం చేసుకునే వారికి అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయని చెప్తారు.
పూజల వెనుక పరమార్ధాలెన్నో.. సైంటిఫిక్ రీజన్స్ కూడా 
శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతమే కాదు చేసే పూజలు , ఉండే ఉపవాసాల వల్ల ఆరోగ్యం బాగుంటుందని కూడా పెద్దలు చెప్తారు . పసుపు, కుంకుమలు శుభ ప్రదమే కాదు ఆరోగ్యదాయకం కూడా అని పెద్దలు చెబుతారు. పసుపులో క్రిమి సంహారక లక్షణాలు, ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని, దానివల్ల ముఖానికి, కాళ్ళకు పసుపు రాసుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే సీజనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయని కూడా చెప్తారు. వర్షాకాలంలో జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయని, అప్పుడప్పుడు ఉపవాసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తారు.
కామెంట్‌లు