కడలి న్యూస్, విశాఖపట్నం:– భీమిలి నియోజకవర్గంలో రూ.170 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన 7 మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణను గడువులోగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల ప్రగతి, టీడీఆర్, నష్టపరిహారం అంశాలపై వీఎంఆర్డీఏ కార్యాలయంలో అధికారులు, స్థలాలు కోల్పోయిన వారితో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భోగాపురం ఎయిర్ పోర్టు సిద్ధమయ్యే జూన్ 26 నాటికి విస్తరణ పూర్తి కావాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని, సీఎం చంద్రబాబు రోడ్ల ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. ఎయిర్ పోర్టు నుంచి వచ్చే వారికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. స్థానికంగా వ్యక్తమవుతున్న అభ్యంతరాల గురించి సమావేశంలో బాధితులతో చర్చించామని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే చలో గుంటూరు పేరుతో వైసీపీ హడావిడి చేస్తోందన్నారు. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబును అంబటి రాంబాబు ఏరకంగా దూషించారో ప్రజలందరూ చూశారని వ్యాఖ్యానించారు. ఆర్డీఓ సంగీత్ మాధుర్, సీసీపీ ప్రభాకర్, సీయూపీ శిల్ప తదితరులు పాల్గొన్నారు.

