- డ్రోన్ లతొ విత్తనాలు చల్లి అడవులు పెంపొందించాలి
- తుప్పలు, డొంకలతో ఉన్న కొండల మీద, తీరం లో చెట్లు పెంచాలి
- గ్రీన్ సోల్జర్స్ టీం లో చేరి పర్యావరణ హితంగా జీవించండి
- జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ
కడలి న్యూస్:– పంటలకు ఉపయోగపడే పక్షులు, ఇతర జీవులను కాపాడుకోవాలి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. ఈ మేరకు ఎంవిపి కాలనీ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తుప్పలు, డొంకలతో ఉన్న కొండల మీద, తీరం లో చెట్లు పెంచాలన్నారు. ప్రధానంగా తూర్పు కనుమల్లో ఉన్న చెట్ల విత్తనాలు, పండ్లు, ఔషధ విత్తనాలు, చిరుధాన్యాలు కొండవాలు ప్రాంతాల్లో చల్లడం అవసరం అని పేర్కొన్నారు. వ్యవసాయంలో వినియోగిస్తున్న రసాయన క్రిమి సంహారకాలు, ప్రధానంగా కలుపు, గడ్డి నివారణకు వినియోగిస్తున్న రసాయనాల వల్ల పంటలకు ఉపయోగపడే పక్షులు, ఇతర జీవులు ఎక్కడికక్కడ మృత్యువాత పడుతున్నాయని వివరించారు. ఇటువంటి సమయంలో వాటిని కాపాడేందుకు డ్రోన్ ల తొ విత్తనాలు చల్లి అడవులు పెంపొందించాల్సిన అవసరం ఉంది అన్నారు. పూరేడు పిట్టలు కనిపించడం లేదు. బంగారు పిచ్చుకలు , బీ ఈటర్స్, కత్తెర పిట్టలు గడ్డి మందు వచ్చాక చాలా వరకూ తగ్గి పోయాయి అని విచారం వ్యక్తం చేశారు. చెమర కాకులు కొన్ని తోటలకు పరిమితం అయ్యాయని, అయితే ప్రస్తుతం అక్కడ కూడా గడ్డి మందు వినియోగం పెరిగి జీవరాశి మనుగడకు కష్టంగా ఉంది అన్నారు. నగరాల్లో పక్షులు వాలని చెట్లు పెంచడం వల్ల వాటి సంతతి తగ్గిందని వివరించారు. ఒక్క ఉడుత నాటినన్ని విత్తనాలు మనం నాటలేం, కాబట్టి సమస్త జీవరాశినీ కాపాడుకోవాలని మనవి చేశారు. పుడమి మీద ఏ జీవి అంతరించినా దాని దుష్ప్రభావం మానవాళి మీద పడుతుంది అని పేర్కొన్నారు. శీతోష్ణస్థితి వేడెక్కడం వల్ల మంచు కొండలు కరిగి సముద్ర నీటి మట్టం పెరిగుతోంది అని ఇటువంటి పరిస్థితుల్లో తీర ప్రాంత రక్షణ వనాలు పెంచాలి అని కోరారు. ఇందుకు గాను వనాలు పెంచడం కోసం మన గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ నేతృత్వంలో గ్రీన్ సోల్జర్స్ కృషి చేస్తున్నారని, విద్యార్థులు అందరూ ఈ టీం లో చేరి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఇప్పటికే ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్స్, పలు విద్యా సంస్థల విద్యార్థులు ద్వారా విత్తనాలు సేకరిస్తున్నాం అని, ప్రకృతి ఆధారంగా పంటలు పండించే రైతుల నుండి చిరు ధాన్యాలు సేకరిస్తున్నామని వివరించారు, తీర ప్రాంతాల్లో ఉప్పు గాలిని తట్టు కారుని పెరిగే చెట్ల విత్తనాలు చల్లడం అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ వాలంటీర్ లు జె రాజేశ్వరి, ఒ కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.



