కడలి న్యూస్, విశాఖపట్నం:– కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ఈ నెల 6 నుంచి నిర్వహించనున్న కోటి తులసి పూజకు విశాఖపట్నంకు చెందిన సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ రూ. రెండు లక్షలు విరాళం అందజేశారు. పూజ నిర్వహణకు వినియోగించాలని ఆయన కోరారు. పూజలో పాల్గొనే రుత్విక్కులు 40 మంది, వేదపండితులు, అర్చకులు మరో 20 మందితో కలిపి మొత్తం వంద మందికి మూడు పూటలా భోజనం, ఫలహారం ఏర్పాటు చేసే భాధ్యతలను దేవస్థానం వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు ఛామర్తి కన్నబాబు, మాజీ అధ్యక్షుడు నాగాభట్ల రవిశర్మకు అప్పగించారు.
అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ రూ.12 లక్షల వ్యయంతో కోటి తులసి పత్రి పూజ నిర్వహిస్తున్నట్లు అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు తెలిపారు. రత్నగిరిపై ఆయన విలేకర్లతో మాట్లాడారు. గతంలో తాను ఈఓగా ఉన్నప్పుడు 2022 ఫిబ్రవరి 15 నుంచి 26వ తేదీ వరకూ ఈ పూజ ఘనంగా నిర్వహించామని చెప్పారు. మళ్లీ ఈ పూజ నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ నెల ఆరో తేదీ ఉదయం 8 గంటలకు పూజ ప్రారంభిస్తామని, 15వ తేదీ రుద్రహోమంతో ఈ క్రతువు ముగుస్తుందని తెలిపారు. రోజుకు 40 బస్తాల తులసి పత్రితో (10 లక్షల దళాలు) రుత్విక్కులు పూజ నిర్వహిస్తారన్నారు. 40 మంది వ్రత పురోహితులు, 20 మంది అర్చకులు, వేద పండితులు ఇందులో పాల్గొంటారని ఈఓ తెలిపారు. రోజూ ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పూజ జరుగుతుందన్నారు. వీటితో పాటు ఇతర పూజలు కూడా చేస్తారు. ఈ పూజకు రూ.50 వేలు చెల్లించిన భక్తులు పది రోజులు పూజలో పాల్గొనవచ్చని, రూ.1,500 చెల్లించిన వారి గోత్రనామాలతో ఒక రోజు పూజ చేస్తారని వివరించారు. పూజకు అవసరమైన తులసి పత్రిని ఒక రోజు ముందే సమర్పించవచ్చున్నారు. పూజకు సంబంధించిన పూర్తి వివరాలు, రుసుం చెల్లించేందుకు www.aptempel.ap.gov.in వెబ్సైట్ ను సందర్శించాలని ఈఓ సూచించారు. విలేకర్ల సమావేశంలో వేద పండితులు గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ ఘనపాఠి, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.




