సూపర్ బజార్ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

 


కడలి న్యూస్ విశాఖపట్నం:– సూపర్ బజార్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మంగ‌ళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, పత్రాల పరిశీలన, స్టాంప్ డ్యూటీ వసూలు విధానాలపై స‌మగ్రంగా పరిశీలించారు. ప్రజలకు అందుతున్న సేవల‌పై ఆరా తీశారు. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు భూముల‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనుస‌రిస్తున్న విధానాలు, అవ‌లంబిస్తున్న ప‌ద్ధతులు, నిబంధ‌న‌లు త‌దిత‌ర అంశాల‌పై కూలంక‌షంగా అడిగి తెలుసుకున్నారు. సేవ‌ల్లో ఎలాంటి జాప్యం జరగకుండా, పారదర్శకంగా అందించాలని అధికారులను ఆదేశించారు. మ‌ధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నిబంధనల ప్రకారం పని చేయాలని, ప్రతి దరఖాస్తుదారుడికి సమానంగా సేవలు అందేలా చూడాలన్నారు. రికార్డుల నిర్వహణలో లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని, సిబ్బంది హాజరు, పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో వేచి ఉన్న పౌరులతో మాట్లాడిన కలెక్టర్ సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర‌, స‌బ్ రిజిస్ట్రార్ క‌న‌క‌ర‌త్నం, ఇత‌ర అధికారులు ఉన్నారు.

కామెంట్‌లు