ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రత్యేక సర్వ సభ్య సమావేశం

 


ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ప్ర త్యేక సర్వ సభ్య సమావేశం ఆదివారం డా.బి.ఆర్.అంబేడ్కర్ భవనంలో జరిగింది. ఈ సమావేశానికి బ్యాంకు అధ్యక్షులు జె.వి.సత్యనారాయణ మూర్తి  అధ్యక్షత వహించారు. ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూ భారత ప్రభుత్వం 2020లో ఆర్డినెన్సు స్థానంలో బిల్లుని ప్రవేశపెట్టి, చర్చ లేకుండానే సహకార చట్టాన్ని ఆమోదించిందని, ఇటీవల కాలంలో ఆ సవరణలలోని కొన్ని అంశాలపై రెండు నోటిఫికేషన్లను జారీచేసి అమలు చేసేందుకు సిద్ధమైందని, ఈ నిబంధనల ద్వారా సహకార సంస్థల పాలకవర్గ పదవీకాల పరిమితిని నిర్దేశించటం.. పాలక వర్గ సభ్యుల పదవుల రద్దుకు ఆదేశించే అధికారాలను రిజర్వ్ బ్యాంకుకు దఖలు పరిచిందని, వీటివల్ల సహకార రంగానికి జరుగుతున్న నష్టాలకు, సభ్యుల ప్రజాస్వామిక హక్కులకు కలుగుతున్న విఘాతం తదితర అంశాలను కూలంకషంగా చర్చించటానికి, తగు నిర్ణయాలు తీసుకోవటానికి ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో బ్యాంకు అన్ని బ్రాంచీలకు చెందిన సంప్రదింపుల కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తెలియపరిచి, పాలకవర్గానికి మార్గదర్శనం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకు ఉపాధ్యక్షులు చలసాని రాఘవేంద్ర రావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సహకార చట్టాలకు చేసిన సవరణల గురించి, వాటివల్ల సహకార రంగం లో జరిగే ప్రతికూల ప్రభావాల గురించి, ఈ సవరణలు, నోటిఫికేషన్ లపై వివిధ రాష్ట్రాల అర్బన్ బ్యాంకు ఫెడరేషన్ సమావేశాలలో చేసుకున్న తీర్మానాల గురించి, నాప్కాబ్ సమావేశం లో జరిగిన చర్చ గురించి వివరించారు. నాప్కాబ్  ఈ సమస్యలపై ఒక ఉప.సంఘాన్ని ఏర్పాటు చేసిందని, ఆ నివేదిక ననుసరించి తగు నిర్ణయాలు తీసుకుంటుందని, 16న విజయవాడ లో మన రాష్ట్ర ఫెడరేషన్ సమావేశమై కేంద్రప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించిందని, దేశంలోని అన్ని ఫెడరేషన్ లు, రాష్ట్రాలలోని అన్ని అర్బన్ బ్యాంకులు  సభ్యుల సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం.. రిజర్వ్ బ్యాంక్ అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను వ్యతిరేకించాలని తెలిపారు. ఈ చట్టాలపై మద్రాస్ హైకోర్టులో విచారణ జరుగుతోందని,  కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలను నిలుపుదల లేదా రద్దు చేసేవరకు అవసరమైతే న్యాయ పోరాటం చేయాలని దానికి తగు తీర్మానాలు చేయాలని సూచించారు. బ్యాంకు పూర్వ అధ్యక్షులు  మానం ఆంజనేయులు మాట్లాడుతూ సహకార చట్ట సవరణలు సహకార సంఘాల స్వయం ప్రతిపత్తిని హరించే విధంగా ఉన్నాయని, సహకార స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని, ఇది జాతీయ సమస్య అని, వీటి అమలును గట్టిగా వ్యతిరేకించాలని, ఈ సమస్యలకు తగు పరిష్కారాలను సూచించాలని తెలిపారు. 2025వ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించినప్పటికి, కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు సహకార సంస్థలను నిర్వీర్యం చెయ్యటానికి, పాలక వర్గాలను నియంత్రించటానికి, సభ్యుల ప్రయోజనాలను దెబ్బ తియ్యటానికి దురాలోచనలు చేస్తున్నాయని తెలిపారు. అందువల్ల సహకార బ్యాంకులు సుప్రీమ్ కోర్టు కైనా వెళ్లి న్యాయ పోరాటం చెయ్యాలని పిలిపునిచ్చారు. బ్యాంకు పాలకవర్గం సభ్యులు సి.ఆర్. సుకుమార్ ఈ చట్టాలలోని న్యాయపరమైన ఇబ్బందులను వివరించారు. బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు ఇతర పాలకవర్గ సభ్యులు కూడా ఈ చట్ట సవరణల వల్ల సహకార రంగానికి జరిగే నష్టాలను విశదీకరించారు. బ్యాంకు యొక్క అన్ని బ్రాంచీల ప్రతినిధులు సమావేశంలో పాల్గొని ఈ సవరణలపై దేశంలోని అన్ని సహకార సంస్థలతో సమన్వయము చేసుకొని న్యాయ పోరాటం చేయాలనీ, మన బ్యాంకు సభ్యులను చైతన్య పరుస్తామని, పాలకవర్గం తీసుకొనే ఎటువంటి చర్యలకైనా తమ సంఘీభావం, మద్దతుగా ఉంటుందని తెలియజేసారు. తద నుగుణంగా పాలకవర్గం చేసిన తీర్మానాలకు తమ ఆమోదం తెలిపారు. జాతీయ అర్బన్ బ్యాంకుల సమాఖ్య కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకుతో చర్చలు జరిపి సహకార బ్యాంకులకు హాని చేసే బ్యాంకింగ్ నియంత్రణ చట్ట సవరణల అమలు నిలుపుదలకు తక్షణమే చర్యలు చేపట్టాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో బ్యాంకు పాలకవర్గ సభ్యులైన సి.కృష్ణమోహన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సహకార వ్యవస్థ మౌలిక స్వరూప, స్వభావాలకు హాని కలిగించే ప్రభుత్వ చర్యలను సమావేశం ఖండిస్తూ, రిజర్వు బ్యాంకు ఈ సవరణపై మద్రాసు హైకోర్టు తీర్పు వచ్చేవరకు వేచి చూడకుండా అమలుకు ఒత్తిడి చేయడం సరికాదని, ప్రజాస్వామిక సంస్థల నిర్వహణలో మితిమీరిన జోక్యం వాటికి హాని కలిగిస్తుందని గుర్తించాల్సిందిగా కోరుతూ సమావేశం తీర్మానించింది. ఈ అంశంలో ఇతర సహకార బ్యాంకులు, సహకార బ్యాంకుల ఫెడరేషన్లతో కలిసి బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో చేసిన సవరణలు రద్దు కొరకు కృషి చేయాలని, న్యాయపరమైన చర్యలు సహా అన్ని రకాలుగా సహకార సంస్థల రక్షణకు కృషి చేయాలని పాలకవర్గానికి నిర్దేశిస్తూ ప్రత్యేక సర్వసభ్య సమావేశం తీర్మానిస్తున్నది.

కామెంట్‌లు