పర్యాటక భూమికి పర్యాటక వినియోగమే సముచితం
కడలి న్యూస్, విశాఖపట్నం:– రుషికొండలోని ప్యాలస్ వినియోగంపై కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆస్తి మొదటి నుంచే పర్యాటక శాఖకు చెందినదేనని, నిర్మాణం చేపట్టిన సమయంలోనే ఇది పర్యాటక శాఖ భూమిపై నిర్మించబడిందని స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాంటి భవనాన్ని పర్యాటక ప్రాజెక్ట్‌గా వినియోగంలో ఉంచడమే సముచితమని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇంత భారీ నిర్మాణానికి నిర్వహణ ఖర్చులు అత్యంత అధికంగా ఉంటాయని, ఆదాయం రాకపోతే దీని సంరక్షణ ప్రభుత్వానికి భారంగా మారే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయంగా ఉంచితే గణనీయమైన ఆదాయం వచ్చే అవకాశాలు లేవన్నది వాస్తవమని తెలిపారు. అందుకే హోటల్ లేదా రిసార్ట్ తరహా పర్యాటక ప్రాజెక్ట్‌కు లీజుకు ఇవ్వడం ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటుందని అన్నారు. రుషికొండ వంటి ప్రాంతాలు సంవత్సరం పొడవునా పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యం కలిగినవని, గతంలో కూడా ఇది ఒక పర్యాటక ప్రాజెక్ట్‌గా ఉన్న వాస్తవాన్ని విస్మరించరాదని పేర్కొన్నారు. చట్టపరంగా ఈ భూమి పర్యాటక శాఖదేనని, అందువల్ల పర్యాటకాభివృద్ధికి అనుబంధంగా దీనిని వినియోగించడమే సమంజసమని అన్నారు. ఇలాంటి ప్రదేశాన్ని ప్రభుత్వ కార్యాలయంగా మార్చడం పర్యాటక దృష్ట్యా సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రభుత్వం దాదాపు రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో, ఇంత పెద్ద స్థాయి మౌలిక సదుపాయాలను వినియోగం లేకుండా వదిలేయడం తగదని అన్నారు. తన అనుభవం ప్రకారం అనేక ప్రభుత్వ భవనాలు కాలక్రమంలో సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుతున్నాయని, దాంతో భవిష్యత్తులో మరింత అధిక ఖర్చులు తప్పవని హెచ్చరించారు. ఈ పరిస్థితిని నివారించాలంటే వృత్తిపరంగా నిర్వహించగల ప్రైవేట్ సంస్థను భాగస్వామిగా చేసుకోవడమే ఉత్తమ మార్గమని తెలిపారు. అలా చేస్తే భవనం సక్రమంగా సంరక్షించబడుతుందని, ప్రభుత్వానికి కూడా స్థిర ఆదాయం లభిస్తుందని అన్నారు. ఇది భూమి స్వభావానికి, పర్యాటక శాఖ ఉద్దేశ్యాలకు పూర్తిగా అనుగుణంగా ఉంటుందని స్పష్టం చేశారు.
వ్యక్తిగత అభిప్రాయాలు వేరు – విధాన నిర్ణయం వేరు
ఈ అంశంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం అని అన్నారు. తన అభిప్రాయం మాత్రం ఉపసంఘం చేసిన సిఫారసులకు అనుగుణంగానే ఉందని స్పష్టం చేశారు. దీన్ని హోటల్ ప్రాజెక్ట్‌కు కేటాయించడమే ప్రభుత్వానికి దీర్ఘకాలికంగా సాధ్యమైన, ఆచరణీయమైన మార్గమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి మౌలిక సదుపాయాలు నిలదొక్కుకోవాలంటే ఆదాయం అనివార్యమని, ఈ అంశంపై తుది నిర్ణయం క్యాబినెట్ ఉపసంఘానికి అప్పగించబడిందని, ఉపసంఘం తన నివేదికను సమర్పించిన అనంతరం స్థానిక ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అందువల్ల ఉపసంఘం తన ప్రక్రియను పూర్తిచేసి ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
