కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ తో పాటు ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ నిర్వహణ
సాధారణ పీజీఆర్ఎస్ కు 273, రెవెన్యూ క్లినిక్ కు 61 వినతుల సమర్పణ
కడలి న్యూస్, విశాఖపట్టణం:– సుదీర్ఘకాలంగా నలుగుతున్న రెవెన్యూ సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపడమే రెవెన్యూ క్లినిక్ ల ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు రెవెన్యూ సమస్యల త్వరితగత పరిష్కారం కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నామని, ఇక నుంచి ప్రతివారం పీజీఆర్ఎస్ తో పాటు ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. జేసీతో పాటు తను కూడా వీటిని పర్యవేక్షిస్తానని చెప్పారు. సోమవారం కలెక్టరేట్ మీటింగు హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించగా, వీసీ హాలులో రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఆర్డీవోలు, తహశీల్దార్లు అక్కడే అందుబాటులో ఉండి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అక్కడికక్కడే ఆన్లైన్ లో చూసి సమస్య స్థితిగతులను చెప్పారు. అలాగే కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడిన కలెక్టర్ ప్రభుత్వ ఉద్దేశాలను, లక్ష్యాలను అర్థం చేసుకొని అధికారులు పని చేయాలని పేర్కొన్నారు. దీర్ఘకాలిక సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపేందుకు రెవెన్యూ క్లినిక్ దోహద పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి రెవెన్యూ అధికారులంతా ఒకేచోట ఉండి ప్రజలకు సమాధానం చెప్పటం వల్ల వారిలో విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రెవెన్యూ క్లినిక్ కోసం కలెక్టరేట్ కింది భాగంగా ప్రత్యేక డెస్కు ఏర్పాటు చేయటంతో పాటు, దరఖాస్తులు నింపేందుకు సహాయకులను నియమించారు. ప్రజలను దగ్గరుండి వీసీ హాలులో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ వద్దకు తీసుకెళ్లారు. ప్రజలు అధికారుల ఎదురుగా కూర్చొని ఫిర్యాదు ఇవ్వడానికి, సమస్య చెప్పుకోడానికి వీలుగా కుర్చీలు వేయటంతో పాటు, ఇతర ఏర్పాట్లు చేశారు.
సాధారణ పీజీఆర్ఎస్ కు 273, రెవెన్యూ క్లినిక్ కు 61 వినతులు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖపట్టణం కలెక్టరేట్లోని మీటింగు హాలులో పీజీఆర్ఎస్, వీసీ హాలులో రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. వారి నుంచి కలెక్టర్, జేసీ, ఆర్డీవోలు, తహశీల్దార్లు ఫిర్యాదులు స్వీకరించారు. మీటింగు హాలులో జరిగిన పీజీఆర్ఎస్ లో జీవీఎంసీ, పోలీస్ తదితర శాఖలకు సంబంధించిన వివిధ సమస్యలపై ప్రజలు 273 వినతులు సమర్పించగా, వీసీ హాలులో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ లో ప్రజలు 61 వినతులు సమర్పించారు. ఇళ్ల పట్టాలు, మ్యుటేషన్, క్రమబద్దీకరణ, ఇతర భూ సంబంధిత సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అందులో ఉన్నాయి.


