మార్గశిర మాసోత్సవాల నిర్వహణకు సన్నద్ధం కావాలి
కడలి న్యూస్, విశాఖపట్టణం:– మార్గశిర మాసోత్సవాల నిర్వహణకు సన్నద్దం కావాలని, ఇప్పటి నుంచే సంబంధిత అభివృద్ది పనులు మొదలు పెట్టి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనాలు కల్పించాలని, నాణ్యమైన అన్నప్రసాదం అందించాలని హితవు పలికారు. శుక్రవారం ఆకస్మికంగా ఆలయాన్ని తనిఖీ చేసిన ఆయన అక్కడ పరిస్థితులను గమనించారు. ధర్మదర్శనం క్యూలైన్లతో పాటు ఇతర క్యూలైన్లను, భక్తుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు ఉన్నాయా లేదా అనే అంశాలను క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం అన్న ప్రసాదం భోజన శాలను సందర్శించి అక్కడ వినియోగించే సరకులను చూశారు. రికార్డులను తనిఖీ చేశారు. రాబోయే మార్గశిర మాసోత్సవాల నిర్వహణకు సంబంధించి ఆలయ అధికారులు అనుసరించబోయే విధానాలపై ఆరా తీశారు. ఆలయ పరిసరాల్లో ఉన్న అన్ని ద్వారాల వద్ద గేట్లు, క్యూలైన్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సంబంధిత మ్యాపులను పరిశీలించారు. గత పొరపాట్లను పునరావృతం కాకుండా మార్గశిర మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. అమ్మవారి విశిష్టతను కాపాడుతూ భక్తులకు తగిన విధంగా మౌలిక వసతులు కల్పించాలని, దర్శనాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పర్యటనలో ఆయన వెంట ఆలయ ఈఈ వెంకట రమణ, ఏఈవోలు, ఇతర అధికారులు ఉన్నారు.