కడలి న్యూస్, విశాఖపట్టణం:– రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అరకు కాఫీ షాప్ లు పెట్టాలని, ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని జీసీసీ అధికారులను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అయిన అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంప వ్యాప్తం చేయటంలో ప్రణాళికాయుత చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే పార్లమెంటు, అసెంబ్లీల్లో పెట్టిన కేంద్రాలను కొనసాగించాలని, మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని చెప్పారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం ఆమె బీచ్ రోడ్లోని జీసీసీ కార్యాలయ సమావేశ మందిరంలో ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ఎండీ కల్పనా కుమారి, డైరెక్టర్లు నాగరాజు, కనకరాజు, నిబ్రహీం, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అరకు కాఫీ ఉత్పత్తుల అమ్మకాలు, దుకాణాల నిర్వహణ, గిరిజన రైతుల సంక్షేమం, బెరి బొర పురుగు వ్యాప్తి తదితర అంశాలపై సమీక్షించారు. భవిష్యత్తు కార్యాచరణపై డైరెక్టర్లు, ఇతర అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అరకు కాఫీకి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, దాన్ని కాపాడుకుంటూ మరింత విజయవంతంగా ముందుకు సాగాల్సి ఉందని, ప్రత్యేక కార్యాచరణతో లాభదాయక చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో దుకాణాలు ఏర్పాటు చేయాలని, గిరిజన ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని సూచించారు. అధికారులు గిరిజన రైతులతో మమేకం అవ్వాలని, వారి యోగ క్షేమాలు తెలుసుకోవాలని, కాఫీ సాగులో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా హితవు పలికారు. జీసీసీ కార్యకలాపాలపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. సమీక్షలో భాగంగా పలు అంశాలపై చర్చించిన ఆమె జీసీసీలో సిబ్బంది తక్కువగా ఉన్నారని, కొత్త నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సచివాలయాల ద్వారా సర్దుబాటు చేసే సిబ్బందిని తాత్కాలికంగా వినియోగించుకోవాలని ఎండీకి సూచించారు. జీసీసీ ప్రాంగణంలో రూ.84 కోట్ల అంచనా వ్యయంతో 12 అంతస్తుల భవనం నిర్మించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. గతంలోనే ప్రపోజల్స్ రూపొందించామని, ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని జీసీసీ అధికారులు చెప్పగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి మరొకసారి తీసుకెళ్తానని మంత్రి పేర్కొన్నారు.
బెర్రీ బోరర్ పురుగుపై ఆందోళన అవసరం లేదు
చింతపల్లి ప్రాంతంలోని కాఫీ తోటల్లో దుష్ప్రభావాన్ని చూపుతున్న బెర్రీ బోరర్ పురుగు వ్యాప్తిపై ఆందోళన అవసరం లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. గిరిజన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని, క్షేత్రస్థాయి పర్యటన చేయాలని, రైతులతో మమేకం అవ్వాలని, వారిలో ధైర్యం నింపాలని సూచించారు. చిన్నపాటి పురుగు కాఫీ తోటలపై ప్రభావం చూపటం విచారకరమని, నివారణకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాప్స్ (చిన్నపాటి ద్రావణంతో కూడిన డబ్బాలు) పెట్టి బెర్రీ బోరర్ పురుగును పట్టుకోవాలని, వేడి నీటి సాయంతో చంపేసి, భూమిలో పాతివేయాలని సూచించారు. వారి నుంచి సంబంధిత కాఫీ గింజలను జీసీసీ ధరకు కొనుగోలు చేయాలని చెప్పారు. ఇదే అంశంపై సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ఇప్పటి వరకు చింతపల్లి ప్రాంతంలో ఓ 80 ఎకరాల్లో బెర్రీ బోరర్ పురుగు ప్రభావం ఉందని, వెంటనే గుర్తించి చర్యలు చేపట్టామని వివరించారు. గిరిజనులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, ఇప్పటికే మన్యం ప్రాంతాల కోసం కేటాయించిన రూ.7,500 కోట్లలో రూ.1300 కోట్లను రోడ్లు వేయటం కోసం ఉపయోగించామని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. డోలీ మోతలు లేకుండా చేయాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు. జ్వరాలపై ప్రత్యేక దృష్టి సారించామని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అరకు కాఫీని ప్రపంచ వ్యాప్తం చేసుందుకు గాను ఇప్పటికే 18 సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ జీసీసీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, బెర్రీ బోరర్ వ్యాప్తిచెందకుండా చేపడుతున్న చర్యలను వివరించారు.