రైలు ప్రయాణీకులకు శుభవార్త... సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు


 కడలి న్యూస్:   పండగ సీజన్ ఆరంభమైంది. ఈ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఫలితంగా దాదాపుగా అన్ని రైళ్లూ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. క్రిక్కిరిసిపోతుంటాయి. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. దేవీ శరన్నవరాత్రులు, దీపావళి, ఛాత్ పూజ వంటి పండగలు, విశేష ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ నుంచి వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తోన్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్- మైసూరు ప్రత్యేక రైళ్లను మరో రెండు నెలల పాటు పొడిగించారు. ఇక ఈ ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టైమ్ టేబుల్ నే కొనసాగించారు. ఇందులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. ప్రయాణికులకు అనుకూలంగా ఉన్నందున ఈ ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పులు చేర్పులు చేయలేదు అధికారులు. అక్టోబర్ 31వ తేదీ వరకు ప్రతి సోమ, శుక్ర వారాల్లో రాత్రి 10:10 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07033 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు మైసూరుకు చేరుకుంటుంది. నవంబర్ 1 తేదీ వరకు ప్రతి మంగళ, శనివారాల్లో సాయంత్రం 5:20 నిమిషాలకు మైసూరు నుంచి బయలుదేరే నంబర్ 07034 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.  బేంగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సేడం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, బెంగళూరు కంటోన్మెంట్, కేఎస్ఆర్ బెంగళూరు, కెంగేరి, మండ్య మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.


కామెంట్‌లు