దేశం నలుమూలల నుంచి హాజరుకానున్న వెయ్యి మంది అతిథులు
భాగస్వామ్యం కానున్న ఏపీ సీఎం, కేంద్ర, రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు
కడలి న్యూస్, విశాఖపట్నం:– ఈ-గవర్నెన్స్ విధానాల అమలు ప్రక్రియ, సిబ్బంది నియామకం, సంక్షేమం, శిక్షణ, కెరీర్ అభివృద్ధి, ప్రజా ఫిర్యాదులు, ప్రజా ఆధారిత ఆధునిక పరిపాలన విధానాలు తదితర అంశాలపై విశాఖపట్టణంలో సెప్టెంబర్ 22, 23వ తేదీల్లో 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు (ఎన్సీఈజీ) జరగనుంది. దీనికి సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ-గవర్నెన్స్ డివిజన్ నేతృత్వం వహిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తోంది. వికసిత్ భారత్, సివిల్ సర్వీస్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పేరిట రెండు రోజుల పాటు స్థానిక నోవాటెల్ హోటల్లో నిర్వహించే ఈ సదస్సులో ఆరు ప్లీనరీ, ఆరు బ్రేక్ అవుట్ సెషన్లు జరగనున్నట్లు సమాచారం. దేశం నలుమూలల నుంచి వెయ్యి మంది వరకు అతిథులు, ఐటీ రంగ నిపుణులు, ఏపీ సీఎంతో పాటు కేంద్ర, రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు భాగస్వామ్యం కానున్నారు. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు ముందుగానే చేయాలని సంబంధిత అధికారులను, నిర్వాహకులను ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. సదస్సు నేపథ్యంలో జిల్లాలోని వివిధ విభాగాల అధికారులతో కూడిన 13 ప్రధాన కమిటీలు, మరొక 10 ఉప కమిటీలు వేశారు. ఆయా కమిటీలు నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఉత్తర్వుల్లో తెలియజేశారు. అధికారులు, ప్రయివేటు ఏజెన్సీలు సమన్వయంతో పని చేయాలని, సదస్సును విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ నిర్దేశించారు. ఆర్గనైజింగ్ కమిటీకి జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్. విశ్వనాథన్ నేతృత్వం వహిస్తుండగా, భద్రతా కమిటీకి పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ నేతృత్వం వహిస్తున్నారు. వీటితో పాటు విమానాశ్రయం, రైల్వే స్టేషన్, హోటళ్ల వద్ద ప్రత్యేక బృందాలను నియమించారు. వైద్య బృందాలతో కూడిన కమిటీలు, ప్లీనరీల నిర్వహణకు సంబంధించిన కమిటీలు, లాజిస్టిక్స్, పబ్లిసిటీ, సుందరీకరణ, మీడియా కమిటీలను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేశారు.