ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్‌కి కొత్త వెలుగులు : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు


కడలి న్యూస్, విశాఖపట్నం :–
అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ రాష్ట్రానికి అభివృద్ధి కొత్త దిశను చూపుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నంలోని ఉపకేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ“ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయి. భవిష్యత్తు తరాల కోసం ఈ హబ్ మార్గదర్శక దీపంలా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.

చంద్రబాబు దూరదృష్టి

“ఇరవై ఏళ్ల క్రితం ఐటీ విప్లవాన్ని ఊహించి హైదరాబాదును సాంకేతిక ప్రపంచ పటంలో నిలబెట్టిన చంద్రబాబు గారి దూరదృష్టి, నేడు అమరావతి నుంచి విశాఖపట్నం వరకు ప్రతిఫలిస్తోంది. కృత్రిమ మేధస్సు, స్టార్టప్ సంస్కృతి, వినూత్న వ్యాపారాల దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న ఆయన విజన్‌ వల్ల ఆంధ్రప్రదేశ్‌ గ్లోబల్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందబోతోంది” అని ఆయన అన్నారు.

విశాఖపట్నం లో కేంద్రం

“ విఎంఆర్డిఎ  నిర్మించిన ది డెక్‌ భవనంలో ప్రారంభమైన విశాఖపట్నం ఉపకేంద్రం, సముద్ర తీర పట్టణానికి కొత్త అవకాశాలను తెరుస్తోంది. త్వరలోనే అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ అడుగుపెట్టడం ఖాయం. విశాఖపట్నం పారిశ్రామిక శక్తిగా మలచడంలో ఇది కీలకమైన అడుగు” అని పల్లా అభిప్రాయపడ్డారు.

నారా లోకేష్ గారి కృషి

“రాష్ట్ర యువతకు దిశానిర్దేశం చేస్తూ, అమరావతిని క్వాంటం వ్యాలీగా, విశాఖను పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దడంలో మంత్రి నారా లోకేష్‌ గారి కృషి విశేషం. యువతలో ఉత్సాహాన్ని రగిలిస్తూ, భవిష్యత్తు నాయకుడిగా ఆయన చూపుతున్న సమర్థత ప్రశంసనీయం” అని ఆయన అన్నారు.

రతన్ టాటా స్ఫూర్తి

“భారత వ్యాపార రంగానికి మార్గదర్శకుడైన రతన్ టాటా గారి స్ఫూర్తి, నేటి యువతలో ఆవిష్కరణల పట్ల ధైర్యాన్ని నింపుతోంది. ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన ఈ హబ్, ప్రతి యువకుడి కలలకు కొత్త రెక్కలు ఇస్తుంది” అని శ్రీ పల్లా తెలిపారు.

యువతకు పిలుపు

“ఈ రోజుల్లో ఆవిష్కరణలే భవిష్యత్తు. పశ్చిమ దేశాల యువతతో సమానంగా పోటీపడాలంటే మన తెలుగు యువతా ముందుకు రావాలి. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త, ఒక ఆవిష్కర్త తయారవ్వాలని సీఎం గారు పిలుపునిచ్చారు. అదే ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తుంది” అని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

కామెంట్‌లు